“అసలు బిడ్డలకు వలెనే కథలకు కూడా మాతృత్వం మాది ” అంటుంది కనుపర్తి వరలక్షమ్మగారి కథలోని రాజేశ్వరి (కథ ఎట్లా వుండాలె?) దాదాపు ’75,’80 ఏళ్ళ క్రితమే స్త్రీవాదం అన్న పేరు కూడా వినిపించని కాలంలోకథ చెప్పటం మా జన్మహక్కు అని ఆమె సగర్వంగా ప్రకటించింది.
అనగనగా అంటూ అమ్మమ్మ చెప్పిన కథతో స్తీలకథ మొదలైందని చెప్పవచ్చు. రాక్షసుడ్ని చంపేసిన రాజకుమారుడి చుట్టూ అల్లుకున్న రాకుమారి అందమైన ఊహల కథ. ఏ రాకుమారుడో వచ్చి యౌవన రెక్కల మీద ఎగరేసుకుపోతాడన్న ఊహల నుంచి రాకుమారుడ్ని పెళ్ళి చేసుకోకుండానే వారసుల్ని కనగలిగే స్థాయికి ఎదిగింది నేటి కథల్లోని కథానాయిక. సైద్ధాంతికపరంగా ఈ మార్పుని స్త్రీవాద కథాపరిణామక్రమంగా చెప్పుకోవచ్చు.
సామాజిక చరిత్రకు సాహిత్యం దర్పణం లాంటిది. మానవ జీవనానికి కథ ప్రతిబింబంలాంటిది. సమాజ పరిణామాలను విమర్శనాత్మకంగా చూసినప్పుడు దాని తాలూకు ప్రతిబింబం మనకు సాహిత్య రూపాల్లో కనిపిస్తుంది. సాహిత్యానికి, సమాజానికి మధ్య వున్న ప్రతిఫలనం అవగాహన చేసుకున్నప్పుడు స్త్రీవాద సాహిత్యం కూడా సరిగ్గా అర్ధమవుతుంది.
తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం తీవ్ర సంచలనాన్ని రేకేత్తించి అనేక వాద వివాదాలకు కారణమైన సంగతి అందరికీ తెలిసిందే. 1980 ల్లో స్త్రీవాద రచయిత్రులు తమదైన స్వరంతో, భావ వ్యక్తీకరణలతో, కొత్త ఇతివృత్తాలతో, సరికొత్త భాషతో, పదచిత్రాలతో తిరుగుబాటు ప్రకటించారు. పితృస్వామ్యం, స్త్రీ, పురుష లైంగిక వివక్ష, స్త్రీల అణచివేత, ఇంటి చాకిరీ మొదలైన విషయాల్ని స్తీవాదం చర్చల్లోకి తీసుకువచ్చింది. స్త్రీగా పుట్టడం వేరు, స్త్రీగా తయారుచేయబడటం వేరు అన్న సంగతిని స్త్రీలు గుర్తించగలిగారు. తరతరాల సమాజం కోటానుకోట్ల మంది స్త్రీలను తయారు చేసి వారిని ఆ విధంగా అదుపుచేయటాన్ని స్త్రీవాదులు నిలదీశారు. స్త్రీ, పురుష వివక్ష గురించి స్త్రీవాద రచయిత్రులు చైతన్య్వంతులై ప్రశ్నించారు. ఆ విధమైన ఆత్మచైతన్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిబింబింపచేసే కథ, కవిత, నవలాసాహిత్యాన్ని స్త్రీవాదులు సృజించారు.
మొదటి దశలో రచయిత్రులకు , అతి కొద్దిమంది రచయితలకు పరిమితమైన స్తీవాదం క్రమంగా మొత్తం సమాజవాదంగా మారింది. ఇవాళ స్త్రీవాదం కేవలం స్త్రీలవాదమే కాదు, సమాజంలోని అన్నివర్గాల వారిది. స్త్రీ చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని గౌరవించే స్త్రీ, పురుష పాత్రల్ని జండర్ భేదం లేకుండా అందరూ తమ రచనల్లో చిత్రిస్తున్నారు. దీన్ని స్త్రీవాదం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్పు సమాజంలో ఆశించిన రీతిలో లేకపోయినప్పటికీ సాహిత్యంలో మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ వ్యాసంలో ప్రధానంగా స్త్రీవాద రచయిత్రుల కథల్ని మాత్రమే చర్చకు తీసుకోవడం జరిగింది.
స్త్రీల జీవితాల గురించి, సమాజంలో స్తీల భాగస్వామ్యాన్ని గురించి రచయిత్రులు మొదటి నుంచీ కథలు రాస్తూనే ఉన్నారు. తమలోని స్త్రీత్వాన్ని నిర్వచించుకుంటూ రచయిత్రులు రాసిన కథలూ వున్నాయి. అయితే స్త్రీవాద కథ అన్నది మాత్రం ‘ 80 ల తర్వాత మాత్రమే కనిపించే భావన. ఇది ప్రధానంగా సైద్ధాంతికపరమైన వృత్యాసాన్ని తీసుకువచ్చింది. 1902లో వెలువడ్డ భండారు అచ్చమాంబ ‘ స్త్రీవిద్య ‘ కథనుండి మొదలుపెడితే… మొదట స్త్రీ విద్యతోనే రచయిత్రుల కథ మొదలైంది. భర్త కోసం చదువుకుంది అచ్చమాంబ కథానాయిక. ఆ కథ ఇతివృత్తం అప్పటి సమాజ పరిస్థితులకు తగినట్టు వుంది. చదువుకోవడంతో మొదలైన స్త్రీ చైతన్యం నెమ్మదిగా ఆర్ధిక స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, స్వాభిమానం, కుటుంబంలో, సమాజంలో సమానస్థానం, సమానహక్కుల గురించి మాట్లాడడం వరకూ వచ్చింది. సామాజికంగా స్త్రీలలో క్రమక్రమంగా వచ్చిన ఈ చైతన్యానికి రచయిత్రుల సాహిత్యం దర్పణం పట్టింది.
మొదటి దశలో రచయిత్రుల కథల్లో కుటుంబంలో, సమాజంలో స్తీ,పురుష మధ్య అంతరాల్ని, వివక్షను అతి సహజ విషయంగా భావించగా స్త్రీవాదకథ ఆ వివక్షను “పురుషాధిపత్యరాజకీయంగా“ గుర్తించి ఎదిరించగలిగింది. అంటే ప్రధానంగా స్త్రీలు రాసిన కథలకు, స్త్రీత్వపు గుర్తింపుతో రాసిన కథలకు, స్త్రీవాద కథలకు వున్న అంతరం సైద్ధాంతికపరమైంది. ఆ సైద్ధాంతికత సమాజంలో అణచివేతకు గురైన అన్నివర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం వహించింది.
స్త్రీల సమస్యలు, స్త్రీ, పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థలోని లొసుగులు వీటన్నింటి గురించి విస్తృతంగా చర్చించిన స్త్రీవాదులు ఇప్పుడు సమాజంతో పాటు కొత్త రూపు తీసుకుంటున్న సమస్యల గురించి మాట్లాడుతున్నారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో స్త్రీల జీవితాల్లో వస్తున్న మార్పుల్ని సునిశిత పరిశీలనతో చర్చకు పెడుతున్నారు. మారుతున్న పల్లెలు, పట్టణ స్వరూపాలు, కరవురక్కసి కాటుకు గురై చిద్రమవుతున్న మానవ సమబంధాలు, అంతరిస్తున్న కులవృత్తులు, జూదంగామారిన వ్యవసాయం, రాజకీయరంగాల్లో స్త్రీలపై కొనసాగే అణచివేత, స్త్రీలు ఎంచుకుంటున్న అకొత్త కెరియర్స్లోని మానసిక, శారీరక ఒత్తిడులు, మత విద్వేషాలు,, ప్రవాసం జీవితంలోని సంఘర్షణ - ఇలా సమాజం విశ్వరూపాన్ని తమ కథల ద్వారా చర్చకు పెడుతున్నారు స్త్రీవాదులు.
ఓల్గా, కుప్పిలిపద్మ, గీతాంజలి, నల్లూరి రుక్మిణి, పి.సత్యవతి, వి.ప్రతిమ, కొండవీటి సత్యవతి, ముదిగంటి సుజాతారెడ్డి, సుభద్ర, ఎస్.జయ, సుబహాషిణీ, చంద్రలత, కె.వరలక్ష్మి, షాజహానా, , పుట్ల హేమలత, సి.సుజాత, నిర్మలారాణి, ఇంద్రగంటి జానకీబాల లాంటివాళ్ళు ఇటీవల రాస్తున్న కథల్ని చదివినప్పుడు, వారి కథల్లోని ఇతివృత్త వైవిధ్యాన్ని, శిల్ప పరిణితినీ్, పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టమవుతుంది.
మొదట్లో శరీర రాజకీయాల గురించి మాట్లాడిన స్త్రీవాదులు ఇవాళ రాజకీయ, రాజ్యవ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. రాచపుండు, గంగజాతర (ప్రతిమ), ముందడుగు (కొండవీటి సత్యవతి) లాంటి కథలు రాజకీయరంగంలో స్త్రీలు పావులవుతున్న వైనాన్ని ప్రశ్నిస్తుండగా, కుబుసం (కుప్పిలి పద్మ), మంత్రనగరి (సత్యవతి), సాలెగూడు (ప్రతిమ), కొత్తకోర్సులొస్తున్నాయి జాగ్రత్త (సుభాషిణి) లాంటి కథలు గ్లొబలైజేషన్ వికృతస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కొత్త కొత్త కెరియర్స్ లో స్త్రీలపై మానసిక, శారీరక ఒత్తిడి ఎక్కువవటమే కాకుండా వారి వ్యక్తిత్వాలు ప్రశ్నార్ధకమవుతున్న తీరును సునిశితంగా ఎత్తి చూపిస్తాయి.
అవర్జా (చంద్రలత), సాలభంజిక (కుప్పిలిపద్మ) కథలు, వైవాహికేతర సంబంధాల్లో స్త్రీలు పడే మానసిక సంఘర్షణను, పల్లె జీవితంలోని వైరుధ్యాలను నల్లూరి రుక్మిణి కథలు చిత్రిస్తే, కరవు, ఫ్యాక్షనిజం భూతాల నోట్లో చిక్కుకున్న స్త్రీల బతుకుల్లోని వేదనను చిత్రిస్తాయి. నిర్మలారాణి, రంగనాయకిల కథలు. స్త్రీలు మతపరమైన అణచివేతల్లొ కూరుకుపోతున్న విధానాన్ని షాజహానా, గీతాంజలి కథలు ఆగ్రహంతో ప్రశ్నిస్తుండగా, ఓల్గా రాసిన సమాగమం లాంటి కథలు పురాణ స్త్రీల మనోభావాలకు సరికొత్త వ్యాఖ్యానం చేస్తాయి. ప్రవాస జీవితంలో స్త్రీలు పడే సంఘర్షణను చిత్రించే కథల్ని స్త్రీవాద కథల్లో ఓ భాగంగా చూడవచ్చు.
ప్రవాసాంధ్ర రచయిత్రుల్లో చాలామంది తమని తాము స్త్రీవాదులుగా ప్రకటించుకోకపోయినా వారి కథల్లోని స్త్రీ పాత్రల సంఘర్షణ, ప్రవాస జీవితంలోని వైరుధ్యాలను వారు చిత్రిస్తున్న తీరు స్త్రీవాదానికి ఓ మంచి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. నిడదవోలు మాలతి (చివురుకొమ్మ, చేవ, నిజానికీ ఫెమినిజానికీ మధ్య, డాలక్ర్కో గుప్పెడు రూకలు) శేషుశర్మ (అన్వేషన్ణ, అగాధం), చినుటాకమల (అమెరికా ఇల్లాలు), ఉపాధ్యాయుల సూర్యకుమారి (అమ్మపెళ్ళి), చెరుకూరి రమాదేవి (యాధృచికం మొదలైన వాళ్ళ కథలు ప్రత్యేకంగా స్త్రీవాద ముద్రతో లేకపోయినప్పటికీ 21 వ శతాబ్దంలో స్త్రీల జీవన విధానాన్ని అవి ప్రతిబింబిస్తున్న కారణంగా వాటిని స్త్రీవాద కథలుగా గుర్తించడం సముచితమే. ఈ విధంగా స్త్రీవాద రచయిత్రుల కలం ఉండి వస్తున్న అనేకానేక కథలు సమాజంలొ స్థూలంగానె కాకుండా సూక్ష్మంగా జరుగుతున్న మార్పుల్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సామాజిక బాధ్యతతో వీరు రాస్తున్న కొత్త కథలు పాథకులకు దిశా నిర్దేశం చెస్తున్నాయి.
అయితే స్త్రీవాదం చల్లబడిపోయిందని, స్త్రీవాద కథలు ఇతివృత్త లోపంతో మూస ధోరణిలోకి వెళ్తున్నాయని, స్త్రీవాద కథల చిత్రణ అంతా నగర, పట్టణ వాసాలకు సంబంధించినది మాత్రమే వుంటోందన్న విమర్శలను మాటలతోనో, వ్యాసాలతోనో కాకుండా పదునైన తమ సాహిత్యం ద్వారా స్త్రీవాదులు తిప్పికొడుతుననరనటానికి పైన పేఋకొన్న కథలే మంచి ఉదాహరణ. అయితే ఇక్కడ మనం అంగీకరించాల్సిన సత్యం మరొకటి ఉంది. ఏ వాదానికైనా కొన్ని పరిమితులుంటాయి..అలాంటి పరిమితులు అస్తిత్వవాదాలన్నింటికి వున్నట్టుగానే స్త్రీవాదానికి కూడా ఉండి. స్త్రీవాద కథలు మూసధోరణిలోకి వెళ్ళడం లేదన్నది వాస్తవమైనప్పటికీ ఒక వాదంగా స్త్రీవాద సాహిత్యం కొన్ని పరిమితులకు లోబడి మాట్లాదుతోందన్నాదిమాత్రం నిరాకరించలేని సత్యం. “స్త్రీల శరీర ధర్మాలను హీనపరిచే పితృస్వామ్య సంస్కృతిని ఎదిరించె క్రమంలో కొన్నిసార్లు స్త్రీవాద సాహిత్యం స్త్రీల చుట్టూ కొని కొత్త ‘ మిత్ ‘ లను కల్పించింది. స్త్రీల ప్రత్యేకతలను ఆధిక్యాలుగా ప్రకటించింది. స్త్రీల శరీర ధర్మాలను, పునరుత్పత్తి శక్తిని “సంపూర్ణ స్త్రీత్వం“గా నిర్వచించిన సాహిత్యం వచ్చింది. ఆమేరకు అవి , శారీరక లోపాలున్న స్త్రీలను గొడ్రాళ్ళుగా, మాచకమ్మలుగా వెక్కిరించిన పురుషాధిపత్యానికి జవాబు చెప్పే శక్తిని కోల్పోయాయి“ అన్న కాత్యాయిని మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి స్త్రీవాద రచయిత్రులు ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా ఈ సంధర్భంలో అవసరమే.
మూస చరిత్ర - పాక్షిక విమర్శ
స్త్రీల సాహిత్యాన్ని , వారి సాహిత్య కృషిని మొదటి నుండి పురుష నిర్మిత విమర్శానా పనిముట్లతోనే పరామర్శిస్తూ స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే చూస్తున్నారు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన స్రవంతి చరిత్రలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నది నిష్టూరసత్యం. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో ఓ మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ళ మీద లెక్కించడమే తప్ప స్త్రీల సాహిత్య కృషిని సరిగ్గా అంచనా వేసే ప్రయత్నమేదీ జరగలేదు. ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో స్త్రీల సాహిత్యాన్ని ఓ పాయగా మాత్రమే ఇన్నేళ్ళు చూపించారు సాహిత్య చరిత్ర రచనావిధానంలొనూ, సాహిత్య విమర్శలోనూ ఇన్నాళ్ళు పురుషస్వామ్యమే రాజ్యమేలింది. మూసపోసిన పురుష స్వామ్య చరిత్ర రచానవిధానాన్ని ప్రశ్నించి దాని తిరగరాసే ప్రయత్నాన్ని స్త్రీవాదులు మొదలెట్టారు. ఆ క్రమంలో వచ్చిన ‘మనకు తెలియని మన చరిత్ర ‘, ‘ మహిళావరణం ‘,’ నల్ల పొద్దు ‘ లాంటి పుస్తకాలు సాహిత్య, సామాజిక రంగాల్లో స్త్రీశక్తిని సరిగ్గా అంచనా కంటే ప్రయత్నాలు. సాహిత్య విమర్శ విషయానికి వస్తే మొదటినుంచి కూడా స్త్రీల సాహిత్యానికి తగినట్టు విమర్శ రాలేదు.
ముఖ్యంగా స్త్రీవాద సాహిత్య విమర్శ ఆశించిన స్థాయిలో రాకపోవటానికి ప్రధాన కారణం అందుకు అనువైన భాషను, విమర్శనాసూత్రాల్ని సంపూర్ణంగా నిర్మించుకోకపోవడం, ఓల్గా, జయప్రభ, కాత్యాయని, కాత్యాయని విద్మహే, మృణాళిని, అబ్బూరి చాయాదేవి, ఎస్.జయ లాంటివాళ్ళు కొంతమేరకు దీనిపై కృషి చేద్సిన అ ఇంకా చేయాల్సింది చాలానే ఉందని చెప్పుకోవాలి. ‘ స్త్రీ విద్య ‘ మొదలుకొని స్త్రీల సమగ్ర